
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికల ఫలితాలు తెరాస సర్కారుకు చెంపదెబ్బ వంటివి. కేసీఆర్ నియంతృత్వ విధానాలపట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా ఈ ఎన్నికల ఫలితాలు నిలుస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాద్యాయుల సమస్యల పరిష్కారానికి వారి తరపున నేను శాసనమండలిలో ప్రభుత్వం పోరాడుతాను,” అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెరాస, ఆ తరువాత ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తన నలుగురు అభ్యర్ధులను గెలిపించుకొని విజయోత్సాహంతో దూసుకుపోతోంది. కానీ ఉపాద్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస బలపరిచిన అభ్యర్ధులు ఓడిపోవడం ఆ పార్టీకి షాక్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఓటమి తెరాసకు కాస్త ఇబ్బందికరమేనని చెప్పుకోవచ్చు. కానీ తెరాసనేతలందరూ లోక్‌సభ ఎన్నికల హడావుడిలో ఉన్నందునే బహుశః ఈ ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయినందున తెరాస అభ్యర్ధులు ఓటమి పాలై ఉండవచ్చు. జీవన్‌రెడ్డి చెపుతున్నట్లుగా ఒకవేళ తెరాస సర్కారు పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత లేదా అసంతృప్తి ఉన్నట్లయితే లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఘనవిజయం సాధించగలగాలి.