
ఏపీ సిఎం చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తునప్పుడు తరచూ తడబడటం, ఆ తడబాటులో తప్పులు మాట్లాడటం అవి జనాలకు వినోదం పంచడం తరచూ జరుగుతున్నవే. తాజాగా అటువంటిదే మరొక విచిత్రమైన మాట ఆయన నోట వెలువడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది నిజమో లేక ఎవరైనా మార్ఫింగ్ చేసి సృష్టించారో తెలియదు కానీ ఆ వీడియోలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు మాత్రం అందరినీ మనసారా నవ్వుకొనేలా చేస్తాయి. వీడియోను బట్టి చూస్తే ఆయన మచిలీపట్నం పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లు కనిపిస్తోంది.
ఇంతకీ ఆ వీడియోలో నారా లోకేష్ ఎమ్మన్నారంటే, “తెలంగాణ సిఎం కేసీఆర్‌గారు ఆంధ్రాకు రావడానికి రెండే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు క్రింద ఉన్న ముంపు మండలాలను మళ్ళీ తెలంగాణలో కలిపేసుకొని ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు...ఇక్కడ ఉన్న మచిలీపట్నం పోర్టును ఆయన తెలంగాణ రాష్ట్రానికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు,” అని అన్నట్లు ఆ వీడియోలో ఉంది.
నారా లోకేష్ నిజంగానే ఈవిధంగా అన్నారంటే నమ్మసక్యంగా లేదు కానీ అని ఉంటే సముద్రం ఒడ్డున నిర్మించిన మచిలీపట్నం పోర్టును సిఎం కేసీఆర్ తెలంగాణకు ఏవిధంగా తరలించుకుపోగలరో ఆయనే చెప్పాలి.
(వీడియో ఏఎల్ఓ టీవీ సౌజన్యంతో)