ప్రధాని కావాలనుకొన్నప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదు?

మహబూబ్‌నగర్‌లో సోమవారం ఉదయం జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ మాధవ్, మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న డికె అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాంమాధవ్ మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలనుకొంటున్నట్లు విన్నాను. మరో లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎందుకు పోటీ చేయడంలేదు? ఆయన 16 ఎంపీలతో దేశరాజకీయాలలో చక్రం తిప్పుతానని అంటున్నారు. కానీ ఈసారి ఎన్నికలలో 5-6 స్థానాలు గెలుచుకొంటే గొప్ప విషయమే అవుతుంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బిజెపి గెలుచుకోబోతోంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమే విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రానుంది. నరేంద్రమోడీయే మళ్ళీ దేశ ప్రధాని కానున్నారనే సంగతి అందరికీ తెలుసు. కేవలం ప్రజలను మభ్యపెట్టి ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికే కేసీఆర్‌ అటువంటి మాయమాటలు చెపుతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన భయోత్పతమైన వాతావరణం నెలకొని ఉండటం చాలా బాధాకరం. ఈ పరిస్థితులు మారాలంటే రాష్ట్రంలో బిజెపిని గెలిపించాలి,” అని అన్నారు. 

డికె అరుణ మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలబడటంలో విఫలమైంది. కనుక రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా బిజెపి మాత్రమే నిలిచింది. కేసీఆర్‌ 16 సీట్లతో ఏమీ సాధిస్తారో, తాను ఏవిధంగా ప్రధానమంత్రి అవ్వాలనుకొంటున్నారో ప్రజలకు స్పష్టంగా వివరించగలరా? ప్రధాని కావాలనుకొనేవారు లోక్‌సభ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయడం లేదు. ఎంపీ కాకుండా ఏవిధంగా ప్రధాని కాగలరు?” అని ప్రశ్నించారు. 

మహబూబ్‌నగర్‌ నుంచి తెరాస అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరపున వంశీ చంద్ రెడ్డి, బిజెపి తరపున డికె అరుణ పోటీ చేస్తున్నారు. ముగ్గురూ బలమైన అభ్యర్ధులే కనుక గట్టి పోటీ ఉంటుంది.