పెద్దపల్లి లోక్సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా జి వివేక్ తెరాసకు రాజీనామా చేశారు. కొద్ది సేపటి క్రితం సిఎం కేసీఆర్కు తన రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ఒక బహిరంగ లేఖ వ్రాశారు.
దానిలో, “తెలంగాణ అభివృద్ధికి కలిసిపనిచేద్దామంటూ నన్ను తెరాసలోకి ఆహ్వానించినప్పుడు 2019 ఎన్నికలలో పెద్దపల్లి లోక్సభ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తరువాత నాకు ప్రభుత్వసలహాదారు పదవిని కట్టబెట్టడమే పెద్ద బహుమతి అని మీ తోలుబొమ్మలు ప్రచారం మొదలుపెట్టాయి. కానీ ఆ హోదాలో ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశాలలో నన్ను పాల్గొనయకుండా ప్రోటోకాల్ భంగం కలిగించారు. ఆ పదవి కారణంగా హైదరాబాద్ క్రికెట్ క్లబ్ అధ్యక్ష పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. అప్పుడు నేను నా పదవికి(ప్రభుత్వసలహాదారు) రాజీనామా చేయడానికి సిద్దపడితే వద్దని వారించారు. నేను రాజీనామా చేస్తే అది మిమ్మల్ని అవమానించినట్లేనని చెప్పడంతో నేను వెనక్కు తగ్గాను. అప్పటి నుంచి నేటి వరకు నన్ను నా నియోజకవర్గం ప్రజలతో కలవనీయకుండా దూరంగా ఉంచుతూ ప్రజలకు, నాకు మద్య దూరం పెంచే ప్రయత్నం చేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన నా వంటివారీనందరినీ పక్కన బెట్టి తెలంగాణ ద్రోహులకు పార్టీలో పదవులు కట్టబెట్టారు. ప్రజాస్వామ్యబద్దమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకోరికతో అందరం కలిసి పొరాడి తెలంగాణ సాధించుకొంటే, ఇప్పుడు అందుకు భిన్నంగా నిరంకుశత్వపాలన సాగిస్తున్నారు. మీ నియంతృత్వ పోకడలను ప్రజలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. వారు తగిన సమయంలో తగిన విధంగా స్పందించకమానరు. లోక్సభ ఎన్నికలకు ఎక్కువ గడువు లేనందున ఇప్పుడు ఎన్నికల బరిలో దిగాలనుకోవడం లేదు. కానీ ఇకపై నా నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను. కష్టకాలంలో నా వెంట నిలిచిన వారందరికీ తెలియజేసుకొంటున్నాను,” అని వ్రాశారు.
లోక్సభ టికెట్ ఇవ్వనందుకు నిరసనగా వివేక్ తెరాసకు రాజీనామా చేయడం అసహజమేమీ కాదు. అయితే ఇంతకాలంగా పార్టీలో ఉంటూ తనకు నియోజకవర్గం ప్రజలకు మద్య దూరం పెరుగుతోందని, తనపై పార్టీ నేతలు సిఎం కేసీఆర్కు పిర్యాదులు చేస్తున్నారని, తనకు ప్రత్యామ్నాయంగా పార్టీలో మరో అభ్యర్ధి వచ్చాడని, లోక్సభ ఎన్నికలలో తనకు టికెట్ లభించకపోవచ్చునని వివేక్ పసిగట్టలేకపోవడమే విడ్డూరంగా ఉంది. ఒకవేళ పసిగట్టి ఉండి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి నేడు తెరాస అభ్యర్ధిపై పోటీకి సిద్దమైయుండేవారు.
బహుశః అందుకే సిఎం కేసీఆర్ చివరి నిమిషం వరకు పెద్దపల్లి నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించకుండా పెండింగులో ఉంచారేమో? ఇప్పుడు వివేక్ ముందు ఒకే ఒక దారి కనిపిస్తోంది. అదే..మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ బలహీనంగా ఉంది. పైగా కేసీఆర్పై కోపం, పగతో రగిలిపోతున్నారు కనుక ఆయన వస్తానంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేకపోయినా ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకవచ్చు .