
పుల్వామా ఉగ్రదాడి... తదనంతర పరిణామాలు ఇంకా కొనసాగుతుండగానే ఈరోజు ఉదయం జమ్ముకశ్మీర్‌లోని అటువంటిదే మరో ఘటన జరిగింది. నిత్యం చాలా రద్దీగా ఉండే జమ్మూ బస్టాండులో నిలిచి ఉన్న ఒక బస్సులో ఈరోజు ఉదయం 11.30 గంటలకు చిన్నపాటి బాంబు ప్రేలుడు సంభవించింది. ఆ ప్రేలుడులో 28 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి అందోళనకరంగా ఉంది. సమాచారం అందుకొన్న భద్రతాదళాలు వెంటనే అక్కడకు చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి, బస్టాండును చుట్టుముట్టి తనికీలు నిర్వహించారు. ఆగి ఉన్న బస్సు కిందకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గ్రేనేడ్ విసిరి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. పుల్వామా దాడి తరువాత కేంద్రప్రభుత్వం తీవ్రంగా స్పందించి రెండు వారాలలలోపే పాక్ భూభాగంలో ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకొంది. కనుక ఈసారి కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.