నేటి నుంచి తెరాస ఎన్నికల సన్నాహక సమావేశాలు



త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తెరాస నేటి నుంచి 9 రోజులపాటు ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్వయంగా వీటిని నిర్వహించనున్నారు. తెరాసకు బాగా అచ్చొచ్చిన కరీంనగర్‌ నుంచి నేడు కేటీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 

ఆ తరువాత వరుసగా మార్చి7న ఉదయం వరంగల్, మధ్యాహ్నం భువనగిరిలో, మార్చి 8న ఉదయం మెదక్, మధ్యాహ్నం మల్కాజ్‌గిరిలో, మార్చి 9 ఉదయం నాగర్ కర్నూల్, మధ్యాహ్నం చేవెళ్ళలో సమావేశాలు నిర్వహిస్తారు. 

మూడు రోజుల విరామం తరువాత మళ్ళీ మార్చి 13 ఉదయం నిజాంసాగర్, మధ్యాహ్నం సికిందరాబాద్‌లో, మార్చి 14 ఉదయం నిజామాబాద్‌, మధ్యాహ్నం అదిలాబాద్‌లో, మార్చి 15నా రామగుండంలో పెద్దపల్లిలో, మార్చి 16 ఉదయం మహబూబాబాద్, మధ్యాహ్నం ఖమ్మంలో, మార్చి 17 ఉదయం నల్గొండ, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి, పార్టీ నేతలకు, శ్రేణులకు లోక్‌సభ ఎన్నికలకు సంబందించి దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాలు ముగిసిన తరువాత సిఎం కేసీఆర్‌తో చర్చించి పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తారు. అప్పటికి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది కనుక వెంటనే ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. 

ఇప్పటి వరకు సిఎం కేసీఆర్‌ స్వయంగా అటు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు చూసుకొనేవారు. ఆ కారణంగా పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయేవారు. కనుక పార్టీ నేతలు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడేందుకు వీలుపడేది కాదు. కానీ ఇప్పుడు కేటీఆర్‌ పార్టీకి పూర్తి సమయం కేటాయిస్తూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నిరంతరం పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని వేరే చెప్పక్కరలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయిలో సాధికారికంగా నిర్ణయాలు తీసుకోగలిగిన కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం చాలా తెలివైన నిర్ణయమేనని చెప్పవచ్చు. ఇది లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు మంచి ఫలితాలు అందించవచ్చు.