
జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ మృతి చెందినట్లు పాక్ మీడియాలో వచ్చిన ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. భారత్ వాయుసేన బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై దాడి చేసినప్పుడు మసూద్ అజహర్ అక్కడే ఉన్నాడని, ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు అతనిని వెంటనే ఓ ఆసుపత్రికి తరలించిన్నట్లు వార్తలు వచ్చాయి. మసూద్ అజహర్ పాక్‌లోనే ఉన్నాడని, అతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని మూడు రోజుల క్రితం పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ సంచలన ప్రకటన చేశారు. ఆయన చెప్పిన మాటలు మసూద్ అజహర్ మృతి గురించి మీడియాలో వస్తున్న వార్తలకు బలపరుస్తున్నట్లే ఉన్నాయి. అయితే మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాలపై పాక్ ప్రభుత్వం స్పందించలేదు ఖండించలేదు. కనుక మసూద్ అజహర్ మృతి చెంది ఉండవచ్చునని అందరూ భావిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే తీర్మానం ప్రవేశపెట్టబడింది కనుక అతనిని కాపాడేందుకే పాక్ ప్రభుత్వం ఈ కొత్త డ్రామా మొదలుపెట్టిందేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అతను భారత్ వాయుసేన దాడిలో గాయపడి చనిపోయాడా లేక కిడ్నీ వ్యాది ముదిరి చనిపోయాడా? అనే విషయం పక్కన పెడితే అతను చనిపోవడం నిజమైతే, అతని కుట్రల వలన ఎన్నో వందలమంది పౌరులను, జవాన్లను కోల్పోయిన భారత్‌కు అది గొప్ప శుభవార్తే.