ఇస్లామిక్‌ సదస్సుకు భారత్‌ హజరు...పాక్‌ డుమ్మా!

అరబ్‌ దేశాల ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు ఈసారి ముఖ్య అతిధిగా భారత్‌ను ఆహ్వానించడం విశేషమైతే, భారత్‌కు అటువంటి గౌరవం ఇచ్చినందుకు సభ్యదేశమైన పాక్‌ ఆ సదస్సుకు మొహం చాటేయడం మరో విశేషం. అబుదాభిలో జరుగుతున్న ఆ సదస్సులో భారత్‌ తరపున పాల్గొన్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. 

“130 కోట్ల మంది భారతీయుల తరపున 18 కోట్లమంది ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా దేశంలో హిందూ, ముస్లిం తదితర మతాలకు చెందిన ప్రజలందరూ ఐక్యతగా కలిసి జీవిస్తూ భారత్‌ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని చాటుతున్నారు. భిన్నమతాలు, బాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన భారత్‌లో ప్రజలందరూ పరస్పరం గౌరవించుకొంటూ కలిసి మెలిసి హాయిగా జీవిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే ప్రమాదకరమైన వేర్పాటువాదం, ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్నారు. అటువంటివారు అన్ని దేశాలలోనూ ఉంటారు. ఇస్లాం అంటే ధర్మం, శాంతికి సూచిక. నిజానికి ఏ మతమూ హింసను ప్రేరేపించవు. అన్ని మతాలు అహింస, శాంతి, కరుణా వంటి మంచి లక్షణాలనే కలిగి ఉండాలని భోదిస్తాయి. భిన్నమతాలకు నిలయమైన భారత్‌ ఆది నుంచి కూడా విశ్వశాంతి, సౌభ్రాత్వత్వమే కోరుకొంటుంది. అందుకు అనుగుణంగానే ఎల్లప్పుడూ ముందుకు సాగుతుంటుంది,” అని అన్నారు. ఆమె ప్రసంగానికి సదస్సుకు హాజరైన సభ్యదేశాల ప్రతినిధులు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.