
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 6వ తేదీ నుంచి 17వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ నేతలతో, లోక్సభకు పోటీ చేయాలనుకొంటున్న అభ్యర్ధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తారు. ఈనెల 1వ తేదీ నుంచే రాష్ట్ర పర్యటన చేపట్టాలని మొదట అనుకొన్నప్పటికీ భారత్-పాక్ మద్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకొన్నారు. భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ విడుదలతో మళ్ళీ ఇరుదేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి కనుక మార్చి 6నుంచి వరుసగా జిల్లా పర్యటనలకు బయలుదేరబోతున్నారు.
మొదటిరోజున కరీంనగర్లో ఉదయం 10.30 గంటలకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తరువాత మార్చి 7వ తేదీన వరంగల్, భువనగిరి నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారు. మార్చి 8న మేదక్, మల్కాజ్గిరి, మార్చి9న నాగర్ కర్నూల్, చేవెళ్ళలో సమావేశాలు నిర్వహిస్తారు. మార్చి 10 నుంచి 12 వరకు మూడు రోజులు విరామం తీసుకొని మళ్ళీ మార్చి 13న సికిందరాబాద్, జహీరాబాద్, మార్చి 14న నిజామాబాద్, ఆదిలాబాద్, మార్చి 15న పెద్దపల్లి, మార్చి 16న ఖమ్మం, మహబూబాబాద్, చివరిగా మార్చి 17న నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించి పార్టీ నేతలతో సమావేశమవుతారు.
ఈ సమావేశాలలో తెరాస లోక్సభ అభ్యర్ధుల పేర్లు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర పర్యటన తరువాత సిఎం కేసీఆర్తో చర్చించి అభ్యర్ధుల పేర్లు అధికారికంగా ప్రకటించవచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను తయారు చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపింది కనుక త్వరలోనే వారి పేర్లను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.