
ఇటీవల హైదరాబాద్‌లో ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ హత్యను కప్పిపుచ్చడానికి నిందితులకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఎస్.మల్లారెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. గురువారం 26 మంది డీఎస్పీలను బదిలీలు చేసిన ప్రభుత్వం మల్లారెడ్డి స్థానంలో వి. యాదగిరి రెడ్డిని నియమించింది. మల్లారెడ్డిని డిజిపి కార్యాలయానికి అటాచ్ చేసి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది.
చిగురుపాటి జయరాంను రాకేశ్ మరికొందరు నిందితులు హైదరాబాద్‌లో హత్య చేసిన తరువాత ఆ హత్యానేరంలో చిక్కుకోకుండా తప్పించుకోవడానికి సిఐ శ్రీనివాస్, ఎసిపి మల్లారెడ్డిలకు ఫోన్ చేసి వారి సలహా మేరకు జయరాం శవాన్ని కారులో పెట్టుకొని కృష్ణాజిల్లాలోని నందిగామ వద్ద విడిచిపెట్టి కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
కానీ పోలీసుల దర్యాప్తులో అది హత్య అని తేలడంతో వారు ఆ కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సిఐ శ్రీనివాస్, ఎసిపి మల్లారెడ్డిల పేర్లు బయటకు వచ్చాయి. పోలీస్ అధికారులై ఉండి వారిరువురూ ఒక హంతకుడికి సహాయపడినందుకు తెలంగాణ డిజిపి వారిరువురినీ విధులలో నుంచి తప్పించారు. ఇప్పుడు మల్లారెడ్డికి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనపెట్టారు.