
నేడు ప్రధాని నరేంద్రమోడీ విశాఖనగరంలో , హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో పర్యటించబోతుంటే, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో మాధాపూర్ ఎన్.ఐ.ఏ.(జాతీయ దర్యాప్తు సంస్థ) నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ నేడు జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకొంటారు. స్థానిక రైల్వే మైదానంలో బిజెపి అధ్వర్యంలో జరుగబోయే ‘ప్రజా చైతన్య యాత్ర’ బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత మళ్ళీ డిల్లీ తిరిగి వెళ్లిపోతారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
రెండు రోజుల క్రితమే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించినందున, ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో అదే ప్రధానంగా ప్రస్తావించి, ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అన్నిటినీ నెరవేర్చుతున్నామని గట్టిగా చెప్పుకోవచ్చు.
కానీ రైల్వే జోన్ పేరుతో కేంద్రం ఏపీని మరోసారి మోసం చేస్తోందంటూ ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. వాల్తేర్ డివిజన్ లో భారీ ఆదాయం వచ్చే భాగాన్ని ఒడిశాకు ఇచ్చి, ఏపీకి ప్యాసింజర్ రెవెన్యూ వచ్చే భాగాన్ని మాత్రమే ఇచ్చి కేంద్రం ఏపీ పట్ల వివక్ష చూపిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు అందరూ నల్లజెండాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. మరోపక్క నేడు విశాఖలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ‘భరోసా యాత్ర’ నిర్వహిస్తోంది. వామపక్షాలు కూడా నేడు ప్రధాని మోడీకి నిరసన తెలుపుతూ విశాఖలో దీక్షలు చేయనున్నాయి.