
గత మూడు వారాలుగా ఆర్మూరులో పసుపు, ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తున్నారు కానీ సంబంధిత అధికారులు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎవరూ వారిని పట్టించుకోకపోవడంతో రైతులు తమ ఆందోళనను రోజురోజుకూ తీవ్రతరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన వందలాది రైతులు గురువారం ఉదయం ఆర్మూరు నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. కానీ వారు ముందుకు సాగుతుండటంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేసి, కొంతమంది రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో మిగిలిన రైతులు ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించారు. అరెస్ట్ చేసిన రైతులను తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల అరెస్టును ఖండిస్తూ నేడు ఆర్మూరు బంద్‌కు పిలుపునిచ్చారు. తాజా సమాచారం ప్రకారం పోలీసులు జిల్లాలోని ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేసి మరో 60 మందిపై బైండోవర్ చేశారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో రైతుల పట్ల ప్రేమ ఒలకబోసిన తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మొహం చాటేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెరాస నిజామాబాద్ ఎంపీ కవిత స్పందిస్తూ, “మా ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు మేలు చేయడానికే చూస్తుంది. కొంతమంది వ్యక్తులు రైతులను వెనక నుంచి రెచ్చగొడుతున్నారు,” అని అన్నారు.
దాదాపు నెలరోజులుగా రైతులు తమ గోడును అధికారులకు, ప్రభుత్వానికి మొరపెట్టుకొంటుంటే ఇంతవరకు స్పందించకపోగా వారిని ఎవరో రెచ్చగొట్టి రోడ్లపైకి పంపుతున్నారనడం చాలా దారుణం. పైగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడం చాలా విచారకరం.