
ఈరోజు ఉదయం కశ్మీరులో ఒక మిగ్ యుద్దవిమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. దానిపై భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఒక సంచలన ప్రకటన చేశారు.
డిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “నిన్న జరిగిన పరిణామాల అనంతరం ఈరోజు ఉదయం పాకిస్థాన్ వాయుసేనకు చెందిన మూడు ఎఫ్-16 యుద్ధవిమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిని భారత్ వాయుసేన సమర్ధంగా తిప్పి కొట్టింది. ఆ ప్రయత్నంలో పాక్ వాయుసేనకు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధవిమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. వాటిని తిప్పి కొట్టే ప్రయత్నంలో భారత్ వాయుసేనకు చెందిన ఒక మిగ్ విమానం కూలిపోయింది. ఆ విమాన పైలట్ (వింగ్ కమాండర్ అభినందన్)ఆచూకీ లభించలేదు. అతను తమ నిర్బందంలో ఉన్నట్లు పాక్ చెపుతోంది. కానీ ఈ విషయం ఇంకా దృవీకరించవలసి ఉంది,” అని చెప్పి రవీష్ కుమార్ సమావేశం ముగించారు.
భారత్ వాయుసేన యూనిఫారం ధరించి ఉన్న ఒక వ్యక్తి ఫోటోను కొద్దిసేపటి క్రితం పాక్ ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. దానిలో అతని చేతులు వెనక్కుకట్టబడి ఉన్నాడు. అతని కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాయి. కనుక భారత్ పైలట్ పాకిస్థాన్‌కు బందీగా చిక్కిన మాట వాస్తవమేనని భావించవచ్చు. ఇది భారత్‌కు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితేనని చెప్పవచ్చు. ఈ పరిస్థితులలో అతనిని పాక్ చెర నుంచి విడిపించుకోవడం దాదాపు అసాధ్యం. విడిపించుకోవాలంటే పాక్ ముందు తలవంచవలసిందే. కానీ భారత్ అందుకు అంగీకరిస్తుందని అనుకోలేము. కానీ పాక్ చర్యకు మళ్ళీ ప్రతీకారం తీర్చుకొనేందుకు మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఈసారి ప్రయత్నిస్తే అటువంటి అవకాశం కోసమే దురుచూస్తున్న పాక్ వాయుసేన భారత్ వాయుసేనను గట్టిగా ప్రతిఘటించడం తధ్యం.