ఎమ్మెల్సీ అభ్యర్ధిని ప్రకటించిన మజ్లీస్

రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ కాబోతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో సిఎం కేసీఆర్‌ నలుగురు తెరాస అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. 5వ స్థానాన్ని మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీకి విడిచిపెట్టారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు మధ్యాహ్నం తమ అభ్యర్ధి పెర్ను ప్రకటించారు. ప్రస్తుతం డబీర్ పురా కార్పొరేటరుగా ఉన్న మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌కు ఆ స్థానం కేటాయిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. రెండు రోజుల క్రితమే  హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుబాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంలను తెరాస అభ్యర్ధులుగా సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీలో నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో  కలిపి మొత్తం 120 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికలలో కేవలం ఐదుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసినట్లయితే 120/5=24 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఏకగ్రీవఎన్నిక జరగాలి. కానీ తెరాస, మజ్లీస్ పార్టీలకు కలిపి మొత్తం 98 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే 5వ అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే, మిగిలిన కాంగ్రెస్‌, బిజెపి ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అది సాధ్యం కాదనే సంగతి అందరికీ తెలుసు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అభ్యర్ధిని నిలబెట్టినట్లయితే, తొలి ప్రాధాన్యత ఓటు విలువ (120/6) 20గా మారుతుంది కనుక వాటికి ఆధనంగా మరొక్క ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవచ్చు కాంగ్రెస్‌, టిడిపిలకు కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక రెండు పార్టీలు చేతులు కలిపితే ఒక అభ్యర్ధిని గెలిపించుకోగలవు. కానీ తెరాస, మజ్లీస్ పార్టీలు తమ 5వ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక తమ అభ్యర్ధిని గెలిపించుకోవడం కంటే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి అదే పెద్ద గెలుపు అని సర్దిచెప్పుకోవచ్చు. 

కాంగ్రెస్ చేతిలో 21 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ అభ్యర్ధిని నిలబెట్టకపోతే మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం పోతుంది. ఒకవేళ అభ్యర్ధిని నిలబెడితే, పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతే ఇంకా నష్టం. కనుక ఏవిధంగా చూసినా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించేవేనని భావించవచ్చు.