
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 2019-20 సం.లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ గురించి వివరిస్తూ, “తీవ్ర ప్రతికూల పరిస్థితుల మద్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గత నాలుగున్నరేళ్ళలో ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ, సవాళ్లను అధిగమిస్తూ, ప్రగతిపధంలో ముందుకు సాగిపోతున్నాము. ఒకప్పుడు దేశంలో తెలంగాణ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రెండు రేట్లు పెరిగి 10.5 శాతం నమోదు అయ్యింది. విద్యుత్, వ్యవసాయ, సాగునీరు, విద్యా, వైద్య మొదలైన అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే రాష్ట్ర ప్రజలు మాపై నమ్మకం ఉంచి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా చేపడుతోంది మా ప్రభుత్వం,” అని అన్నారు.
పింఛన్ల గురించి వివరిస్తూ, “ఎన్నికల సమయంలో అందరికీ పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చాము. ఆ హామీని నిలబెట్టుకొంటూ వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ కార్మికులు, భోదకాలు వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులు, నేత, గీత కార్మికులకు ఇక నుంచి నెలకు రూ. 2,116 పింఛను అందజేస్తాము. దివ్యాంగులకు నెలకు రూ.3,116 ఇస్తాము. వృద్ధాప్య పింఛను పొందడానికి ఇదివరకు 60 సం.లు కనీస వయోపరిమితి ఉండేది. దానిని 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నాము,” అని తెలిపారు.
నిరుద్యోగభృతి కోసం బడ్జెట్‌లో రూ.1,810 కోట్లు కేటాయించినందున ఏప్రిల్ 1వ తేదీ నుంచే రాష్ట్రంలో గల 10 లక్షలకు పైగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 కేటాయించవచ్చు. అయితే దాని కోసం ఇంతవరకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. అది వెలువడితేగానీ నిరుద్యోగ భృతిపై స్పష్టత రాదు.