పుల్వామా బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం

ఈరోజు తెలంగాణ శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాగానే సిఎం కేసీఆర్‌ శాసనసభలో, మంత్రి ఈటల రాజేందర్‌ మండలిలో పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆ తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌ పుల్వామా 40 బాధిత కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.25 లక్షలు చొప్పున ఆర్ధికసాయం ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు అధికార, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఆయనను అభినందించాయి. అనంతరం ఉభయసభల సభ్యులు సంతాప తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. తరువాత శాసనసభను 15 నిమిషాలపాటు వాయిదా వేస్తునట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సభ మళ్ళీ సమావేశం కాగానే సిఎం కేసీఆర్‌ ఓట్-ఆన్‌-బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.