సూర్యాపేట కలెక్టర్ సంచలన నిర్ణయం

సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. జిల్లాలోని 19 మంది తహసిల్దారులను ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పనితీరు మెరుగుపరుచుకోకపోవడంతో వారి ఫిబ్రవరి నెల జీతాలు నిలిపివేయించాలని నిర్ణయించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రికార్డులను సరిచేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించవలసింది. దీని కోసం కలెక్టర్ ఆమోయ్ కుమార్ గత 2-3 నెలలలో అనేకసార్లు తహసీల్దార్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ కొన్ని మండలాలలో తహసిల్దారులు మాత్రం నేటికీ ఆ పనులు పూర్తి చేయకపోవడంతో  నేటికీ ఆయా గ్రామాలలో రైతులు పాసు పుస్తకాల కోసం తహసిల్ధార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ సమస్య గురించి మీడియాలో వార్తలు వస్తుండటంతో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం లభిస్తోంది. 

కనుక ఆయా మండలాలలో తహసిల్దారుల ఫిబ్రవరి నెల జీతాలు నిలిపివేయాలని కోరుతూ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ ట్రెజరీ కార్యాలయానికి లేఖ వ్రాశారు. కలెక్టర్ నిర్ణయంపై తహసిల్దారులు మండిపడుతున్నప్పటికీ, బాధిత రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా తహసిల్దారులు మేల్కొని భూరికార్డులను అప్-డేట్ చేసి తమకు తక్షణమే పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నారు. 

తుంగతుర్తి, నూతన్ కల్, సూర్యాపేట, జాజిరెడ్డి గూడెం, చివేంల, నాగారం, మోతి, పెన్ పహాడ్, మద్దిరాల, ఆత్మకూరు (ఎస్), తిరుమలగిరి, మట్టంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నడిగూడెం, హుజూర్ నగర్, చిలుకూర్, కోదాడ, మునగాల తహసిల్దారుల ఫిబ్రవరి నెల జీతాలు నిలిపివేయబడనున్నాయి.