ఖమ్మం నుంచి పోటీ చేస్తా: వద్దిరాజు రవిచంద్ర

ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేయడానికి కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఖమ్మం నియోజకవర్గంలో పార్టీలో నేతల మద్య కొన్ని అభిప్రాయబేధాలున్నప్పటికీ నాకు అందరితో నాకు సత్సంబంధాలున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే బలమైన కోరిక నాతో సహా ప్రతీ కాంగ్రెస్‌వాదీకి ఉంది. అందుకే ఈసారి నేను ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకొంటున్నాను. నాకు టికెట్ లభిస్తుందనే భావిస్తున్నాను. నా విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి ఉంటాను. ఒకవేళ వేరే ఎవరికైనా టికెట్ ఇచ్చినా వారికి నేను పూర్తిగా సహకరిస్తాను,” అని చెప్పారు. 

అయితే ఈసారి ఖమ్మంతో సహా 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీయే ఉండబోతోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన పలువురు సీనియర్ నేతలు ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకొంటున్నారు. పైగా అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న తెరాస ఈసారి 16 లోక్‌సభ సీట్లను తామే గెలుచుకొంటామని చాలా నమ్మకంగా చెపుతోంది. కనుక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపు కోసం చాలా చెమటోడ్చవలసి ఉంటుంది. ప్రస్తుతం తెరాస ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ ఆయనే ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకొంటున్నారు.  

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోవలసి ఉంటుంది కనుక లోక్‌సభ ఎన్నికలలో పార్టీలో సీనియర్లకు, గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్స్ లభించే అవకాశం ఉంటుంది. కనుక వద్దిరాజు రవిచంద్రకు టికెట్ లభిస్తుందో లేదో అనుమానమే.