అది మంచి నిర్ణయమే...ముందే తీసుకొనుంటే...

పుల్వామా దాడి తరువాత భద్రతాదళాల భద్రత గురించి ఆలోచించవలసి వచ్చింది. మళ్ళీ అటువంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇక నుంచి భద్రతాదళాలను విమానాల ద్వారా తరలించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. డిల్లీ-శ్రీనగర్-జమ్ము మార్గాలలో భద్రతాదళాలను విమానాలలో తరలించడానికి అనుమతించింది.

ఇప్పటి వరకు భద్రతాదళాలలో కేవలం ఉన్నతాధికారులు మాత్రమే విమానాలలో ప్రయాణించేవారు. కేంద్ర హోంశాఖ తీసుకొన్న ఈ నిర్ణయంతో ఆర్మీలో కానిస్టేబుల్ ర్యాంక్ వరకు సిబ్బంది కూడా విమానాలలో తరలించబడతారు. విధులు నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే కాకుండా వారు శలవులో వెళుతునప్పుడు కూడా విమానాలలో ప్రయాణించవచ్చునని కేంద్ర హోంశాఖ తెలిపింది.

కనుక డిల్లీ-జమ్ము-శ్రీనగర్ మార్గంలో సాధారణ మరియు వాయుసేన విమానాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. కేంద్ర హోంశాఖ తీసుకొన్న ఈ తాజా నిర్ణయం వలన అన్ని రకాల కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలలో కలిపి మొత్తం 7,80,000 మందికి విమానసేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఆలస్యమైనా కేంద్రప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకొందని చెప్పవచ్చు. కానీ ఇదే నిర్ణయం చాలా ఏళ్ళ క్రితమే తీసుకొని ఉంటే ఆ ప్రాంతాలలో జరిగిన అనేక ఉగ్రదాడులలో ఇంతమంది జవాన్లు చనిపోయుండేవారుకారు. 

2013, డిసెంబర్ 11న నవ గావ్ లో జరిగిన దాడిలో ఒక జవాను చనిపోయాడు.   

2014, డిసెంబర్ 3న పుల్వామాలో జరిగిన దాడిలో ఒక జవాను చనిపోయాడు. 

2015, డిసెంబర్ 7 వ తేదీన ఆర్మీ కాన్వాయ్ పై పాంపోర్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. 

2016, ఫిబ్రవరి 20న జరిగిన దాడిలో ఇద్దరు జవాన్లు చనిపోయారు. 

2016, జూన్ 25న జరిగిన దాడిలో 8 మంది చనిపోయారు. 

2019, ఫిబ్రవరి 14న జరిగిన దాడిలో 43 మంది చనిపోయారు.