తలసానితో ఏపీ టిడిపి ఎమ్మెల్యే భేటీ!

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మద్య ఎటువంటి వైరం ఉందో అందరికీ తెలుసు. కనుక టిడిపి, టీఆర్ఎస్‌ నేతలు కూడా ఒకరికొకరు దూరంగానే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార టిడిపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హైదరాబాద్‌ వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో సమావేశం కావడం విశేషం. 

తూర్పు గోదావరిజిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తోట త్రిమూర్తులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆయన ఖండిస్తునప్పటికీ వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారని సమాచారం. వైసీపీలో చేరేందుకు ఆయన నేరుగానే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సంప్రదించవచ్చు లేదా ఇటీవలే ఆ పార్టీలో చేరిన మరో టిడిపి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ద్వారా ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపవచ్చు. కానీ ఆవిధంగా చేయకుండా హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ మంత్రి తలసానితో సమావేశంకావడం ఆలోచింపజేస్తోంది. 

ఏపీలో బీసీలను ఏకం చేసి త్వరలో జరుగబోయే లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపిని ఓడిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇదివరకే చెప్పారు. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే తలసాని-తోట సమావేశం జరిగి ఉండవచ్చు. 

మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాలపై తోట త్రిమూర్తులు స్పందిస్తూ, “నేను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటాను. తలసాని టిడిపిలో ఉన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు. పార్టీలకు అతీతంగా నేటికీ మా స్నేహం కొనసాగుతోంది. ఒక శుభకార్యానికి ఆయనను ఆహ్వానించడానికే నేను హైదరాబాద్‌ వచ్చి ఆయనను కలిశాను తప్ప వేరే ఏ ఉద్దేశ్యం లేదు,” అని చెప్పారు.