హరీష్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ సాగునీటి శాఖామంత్రి, తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుదవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, “హరీష్‌రావు సింగూరు నీటిని శ్రీరాంసాగర్‌కు దొంగతనంగా అర్ధరాత్రిపూట తరలించుకుపోతున్నారు. సింగూరు నీటిని దోపిడీ చేస్తూ సంగారెడ్డి ప్రజల గొంతు ఎండబెడుతున్నారు. ఆయన కేసీఆర్‌ బందువు కనుక అధికారులు కూడా ఎదురుచెప్పకుండా శ్రీరాంసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ విషయం సిఎం కేసీఆర్‌కు తెలిస్తే ఆయన అంగీకరించేవారే కాదు. ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా హరీష్‌రావు వ్యవహరిస్తున్నారు. ఇటువంటివన్నీ నేను అడుగుతాననే భయంతోనే అసెంబ్లీ ఎన్నికలలో నన్ను ఓడించడానికి హరీష్‌రావు విశ్వప్రయత్నాలు చేశారు. సింగూరు జలాలను తరలించుకు పోయినందుకు హరీష్‌రావు సంగారెడ్డి ప్రజలకు క్షమాణలు చెప్పాలి,” అని అన్నారు.