అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు వారెంట్స్

మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వం రద్దు కేసులో వ్యక్తిగతంగా హాజరుకావలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోనందుకు రాష్ట్ర న్యాయశాఖ, శాసనసభ కార్యదర్శులు వి.నిరంజన్‌రావు, వి.నర్సింహాచార్యులకు కోర్టుధిక్కార నేరం క్రింద హైకోర్టు శుక్రవారం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వారివురువురినీ ఫిబ్రవరి 15వ తేదీన కోర్టు ముందు హాజరుపరచాలని హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వారిరువురూ చెరో రూ.10,000 పూచీకత్తు చెల్లించాలని కూడా ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు.