సింగరేణిలో ఏమి జరుగుతోంది?

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంతమంది అవినీతి అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు వరంగా మారింది. కార్మికులకు మెడికల్ ఆన్‌-ఫిట్ సర్టిఫికేట్ ఇప్పించి వారి వారసులకు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించడం సింగరేణిలో ఓ పెద్ద దందాగా మారిపోయింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సింగరేణి మెడికల్ బోర్డులో జరుగుతున్న అవకతవకలు అక్రమాలపై దర్యాప్తు చేయగా అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జి.కె.సంపత్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆ ఆధారాలతో వారు కొత్తగూడెంలోని ఆయన ఇంటిలో, ఆయన సోదరుడి ఇంటిలో బుదవారం  సోదాలు చేసి కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంపత్‌కుమార్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఆయనపై కేసు నమోదు చేశారు. 

కార్మికులకు ఆన్‌-ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఒక్కో కార్మికుడి దగ్గర లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు పిర్యాదులు అందడంతో సింగరేణి సంస్థ రెండు నెలల క్రితమే ఆయనను సస్పెండ్ చేసింది. తమ ఆరోగ్యం, ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణికి, తద్వారా దేశానికి సేవలు చేస్తున్న కార్మికులు అనారోగ్యంతో పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవలసిన బాధ్యత సింగరేణి సంస్థపై, ప్రభుత్వంపై ఉందనే భావనతో వారసత్వ ఉద్యోగాల విధానాన్ని అమలుచేస్తుంటే, కొందరు అవినీతిపరులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కార్మికులను రాబందులులాగా పీక్కు తింటుండటం చాలా బాధాకరం.