త్వరలో రాష్ట్ర కాంగ్రెస్‌ పునర్వ్యవస్థీకరణ?

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న డిల్లీలో సమావేశమైనప్పుడు రాష్ట్ర నాయకత్వ లోపంపై కూడా పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వేలెత్తి చూపినట్లుగానే భావించవచ్చు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియాను మార్చాలసిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ఆయనను బాధ్యుడిని చేసే ప్రయత్నం జరిగినట్లు అర్ధం అవుతోంది.

పార్టీ నాయకత్వ లోపంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది. గతంలో ఆంధ్రా, తెలంగాణలు కలిసి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఒక్కరి చేతుల మీదుగా నడిచేదని కానీ ఇప్పుడు చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువమంది వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించడం వలన కీలకమైన ఎన్నికల సమయంలో వారి మద్య సమన్వయం, అవగాహన కొరవడిందని, కనుక అనవసరమైన ఆ పదవులు రద్దు చేసినట్లయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బలమైన నాయకత్వం ఏర్పడుతుందని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. ఆయన సూచనకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కనుక వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్‌ కమిటీల పేరిట రాజకీయనిరుద్యోగులకు పని కల్పించడంపై కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచన చేసినట్లయితే త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు అటువంటి సాహసం చేస్తుందో లేదో చూడాలి.