
ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ‘కిసాన్ సమ్మాన్’ పధకం అమలుకు కేంద్రప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా మంగళవారం హైదరాబాద్ వచ్చి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, రాష్ట్ర వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఈ పధకం అమలు గురించి చర్చించారు.
ఈ పధకం గురించి ఆమె ఏమి చెప్పరంటే,
1. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పధకంతో విలీనం చేయబోము. వేరేగానే చెల్లింపులు చేస్తాము.
2. ఈ పధకం సన్నకారు, చిన్నకారు రైతులకోసం ప్రవేశపెట్టబడింది కనుక 5 ఎకరాల వరకు భూమి ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు.
3. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు అందరినీ కలిపి ఒక యూనిట్ గా తీసుకొంటాము కనుక ఒక కుటుంబంలో అందరికీ కలిపి 5 ఎకరలు లేదా అంతకంటే తక్కువ సాగుభూమి ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. వ్యక్తికి లేదా కుటుంబానికి ఎన్ని చోట్ల వేర్వేరుగా సాగుభూమి ఉన్నప్పటికీ అది 5 ఎకరాలకు మించి ఉండరాదు. ఉంటే వారికి ఈ పధకం వర్తించదు.
4. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు ఈ పధకం వర్తించదు.
5. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 5 ఎకరాలు లేదా అంతకంటే తక్కువ భూమి ఎవరి పేరు మీద ఉంటే వచ్చే 5 ఏళ్ళ వరకు వారినే ఈ పధకానికి లబ్ధిదారుగా గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలోకే మూడు వాయిదాలలో రూ.6,000 జమా చేయబడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పధకంలో 5 ఎకరాల పరిమితిలేదు. అదేవిదంగా ప్రజా ప్రతినిధులతో సహా భూయాజమాన్యపు హక్కును దృవీకరించే పట్టాదారు పాసు పుస్తకాలున్న ప్రతీ ఒక్కరికీ రైతుబంధు పధకాన్ని వర్తింపజేసింది. కానీ కిసాన్ సమ్మాన్ పధకంలో లబ్దిదారుల ఎంపికకు పరిమితులున్నాయి ఆ ప్రకారం అర్హులైన రైతులను గుర్తించవలసి ఉంటుంది. రైతుబంధు పధకం కోసం సేకరించిన రైతుల వివరాలలో ఇప్పటికే 5 ఎకరాలలోపు సాగుభూమి ఉన్న రైతుల వివరాలున్నాయి కనుక వాటినన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ కొత్త జాబితాను రూపొందించవలసి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కిసాన్ సమ్మాన్ పధకాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేయాలనుకొంటోంది కనుక ఆలోపుగానే రాష్ట్రంలో ఈ పధకానికి లబ్దిదారుల జాబితాలను సిద్దం చేసి కేంద్రానికి పంపించవలసిందిగా వసుధ మిశ్రా రాష్ట్ర అధికారులను కోరారు.