లోక్‌సభకు పోటీ చేస్తా: అద్దంకి దయాకర్

తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపినందుకు కాంగ్రెస్‌ నేతలు సిఎం కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, ఆయన నిర్ణయం వల్ల ఇప్పుడు వారికే మేలు జరిగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి ఉండి ఉంటే ఎన్నికలలో ఓడిపోయినవారికి మళ్ళీ ఐదేళ్ళ వరకు ఎటువంటి అవకాశాలు ఉండవు కనుక అప్పటి వరకు ఎదురుచూస్తూ కూర్చోవలసివచ్చేది. కానీ సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు వెంటనే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించింది. ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, డికె.అరుణ తదితరులు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. తాజాగా తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ కూడా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. తాను ఏ స్థానం నుంచి పోటీ చేయాలో కాంగ్రెస్‌ అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. 

ఈసారి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినవారు కూడా లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతుండటంతో టికెట్ల కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొని ఉంది. లాబీయింగ్ చేసుకోగలిగినవారికే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు, పదవులు లభిస్తాయని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్ననే చెప్పారు. కనుక షరా మామూలుగా టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో లాబీయింగ్ మొదలైంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం 11.30 గంటలకు డిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. దానిలో లోక్‌సభ ఎన్నికలకు సంబందించి అన్ని అంశాలపై వారితో చర్చించనున్నారు.