
మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌కొండ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోతున్న నారాయనపేట జిల్లాలో చేర్చవద్దని కోరుతూ ఆ మండలంలోని గ్రామాలప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడికి లొంగి అధికారులు తమ మండలాన్ని 60 కిమీ దూరంలో ఉండే నారాయణపేట జిల్లాలో విలీనం చేసేందుకు సిద్దం అవుతున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఉదయం కోయిల్‌కొండ మండలంలో అన్ని గ్రామాల ప్రజలు మహబూబ్‌నగర్-కోయిల్‌కొండ మార్గంలో దమ్మాయిపల్లి గేటు వద్ద రోడ్డుపక్కనే బైటాయించి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వారిని చెదరగోట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో వారు తిరగబడ రాళ్ళతో పోలీసులపై దాడి చేశారు. ఆ దాడిలో సీఐ పాండురంగారెడ్డి తలకు గాయమైంది. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీస్, జిల్లా ఉన్నతాధికారులు కోయిల్‌కొండ గ్రామపెద్దలతో చర్చిస్తున్నారు. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ కోయిల్‌కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో విలీనం చేసేందుకు తాము ఎట్టి పరిస్థితులలో అంగీకరించబోమని గ్రామస్తులు తెగేసి చెపుతున్నారు.