
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డికి శుక్రవారం ఈడి నోటీస్ పంపింది. నోటీస్ అందుకున్నప్పటి నుంచి వారం రోజుల లోపుగా హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి హాజరవ్వాలని కోరింది. మళ్ళీ ఈ కేసులో కదలిక మొదలైంది కనుక ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కూడా త్వరలోనే ఈడి విచారణకు పిలిచే అవకాశం ఉంది.
వేం నరేందర్ రెడ్డి గతంలో టిడిపిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి పోటీ పడ్డారు. ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి తదితరులు తెరాస నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 50 లక్షలు ముడుపులు చెల్లించబోయి ఏసీబీ వలలో చిక్కిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ కేసు విచారణ జోరుగా సాగినప్పటికీ, ఒక కేంద్రమంత్రి జోక్యంతో అటకెక్కినట్లు వార్తలు వచ్చాయి. అటక మీద ఉన్న ఆ పాత కేసు పాండవులు జమ్మి చెట్టు మీద దాచుకున్న అస్త్రాలుగా మారాయి. పాండవులు కురుక్షేత్రయుద్దానికి ముందు వాటిని జమ్మిచెట్టు మీద నుంచి క్రిందకు దింపి శత్రువులపై ప్రయోగిస్తే, లోక్‌సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్, బిజెపిలు తమ శత్రువుల మీద ఆ కేసును ప్రయోగిస్తున్నాయనుకోవచ్చు.