డిల్లీలో కాంగ్రెస్‌ మిత్రపక్షాల సమావేశం

లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించి ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం డిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సేవ్‌ ది నేషన్‌-సేవ్‌ డెమోక్రసీ అనే పేరుతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, డిఎంకె పార్టీ తరపున కనిమోళి, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరాక్ ఒబ్రెయిన్ ఇంకా శరద్ పవార్, రాంగోపాల్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలలో మిత్రపక్షాల మద్య అవగాహన, పరస్పర సహకారం ఏవిదంగా ఉండాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఈవీఎంలు, వివి ఫ్యాట్ యంత్రాల పనితీరుపై చర్చించారు. సోమవారం కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి వాటిపై తమకున్న అనుమానాలను తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ఈరోజు ప్రకటించిన బడ్జెట్‌లో పలుఅంశాలపై విశ్లేషిస్తూ విమర్శలు గుప్పించారు. గత నాలుగున్నరేళ్ళలో అన్ని రంగాలలో విఫలమైన మోడీ సర్కార్, దేశప్రజలను ప్రసన్నం చేసుకొని లోక్‌సభ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలనే తాపత్రయంతోనే నేడు జనాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్రమోడీ వివక్ష చూపుతుండటాన్ని నిరసిస్తూ సిఎం చంద్రబాబునాయుడు నల్లచొక్కా ధరించి సమావేశానికి హాజరయ్యారు.