
కేంద్రప్రభుత్వం ఈరోజు బడ్జెట్‌లో ప్రకటించిన పధకం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పధకాన్ని పోలి ఉండటంపై తెరాస ఎంపీ కవిత, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలు చాలా భిన్నంగా స్పందించారు.
కేటీఆర్ స్పందిస్తూ, “మా ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పధకం స్పూర్తితో కేంద్రప్రభుత్వం కూడా అటువంటి పధకాన్నే వేరే పేరుతో అమలుచేయడాన్ని మేము ప్రశంసగానే స్వీకరిస్తాము. అనుకరణకు మించి ప్రశంస ఏముంటుంది. కేసీఆర్ మానసపుత్రిక అయిన రైతుబంధు పధకం ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరికీ అందుబాటులోకి వచ్చి మేలు కలిగిస్తుంటే మాకు సంతోషమే,” అని అన్నారు.
ఎంపీ కవిత స్పందిస్తూ, “మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన బడ్జెట్ ఖచ్చితంగా ఎన్నికల బడ్జెటే. దానిలో మా రైతుబంధు పధకాన్ని కాపీ కొట్టింది కానీ దానిని సరిగ్గా కాపీ కొట్టలేకపోయింది. మా ప్రభుత్వం ఏకరాకు రెండు పంటలకు కలిపి రూ.10,000 ఇస్తుంటే కేంద్రప్రభుత్వం కేవలం రూ.6,000 మాత్రమే మూడు వాయిదాలలో ఇస్తామని చెపుతోంది,” అని విమర్శించారు.
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “సిఎం కేసీఆర్ పధకాన్ని మోడీ కాపీ పేస్ట్ చేశారు. మోడీకి కేసీఆర్ మాదిరిగా దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించగల సొంత ఆలోచన, దూరదృష్టి కానీ లేవు. రైతుబంధు పధకాన్ని కేంద్రం అనుకరించడం రైతు సమస్యల పరిష్కారంలో సిఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా నిలిచాయి. దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించే సమయం ఆసన్నమైంది,” అని అన్నారు.