యూసఫ్ గూడాలో ప్రేలుడు

క్షణం తీరికలేని జీవితాలు గడుపుతున్న హైదరాబాద్‌ నగరవాసులు ఈరోజు ఉలిక్కిపడ్డారు. యూసఫ్ గూడాలోని నిత్యం రద్దీగా ఉండే వెంకటగిరి చౌరస్తా వద్ద ఈరోజు సాయంత్రం భారీ ప్రేలుడు సంభవించింది. దాంతో పరిసర ప్రాంతాలలో ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఆ ఘటనలో మాణిక్ రావు అనే దినసరికూలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం హుటాహుటిన అక్కడకు చేరుకొని ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించారు. ఈ ప్రేలుడులో గాయపడిన వ్యక్తి చౌరస్తాలో గల చెత్తకుండీలో దొరికిన ఒక డబ్బాను పగులగొట్టే ప్రయత్నం చేయబోతే ప్రేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. డబ్బాలో ఏదో ప్రమాదకర రసాయనం మిగిలిపోయి ఉన్నందున ఈ ప్రేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రేలుడులో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు.