సిఎం కేసీఆర్‌ త్వరలో విశాఖ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్ళీ వచ్చే నెల 14వ తేదీన విశాఖపట్నం వెళ్ళబోతున్నారు. క్రిందటి నెల భువనేశ్వర్ వెళుతున్నప్పుడు ముందుగా విశాఖపట్నంలో దిగి అక్కడ గల శారదాపీఠాధిపతి స్వరూపానందస్వామిని కలిసి హోమకార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఇటీవల ఎర్రవల్లిలో జరిగిన మహాచండీ యాగానికి స్వామీజీ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఫిబ్రవరి 10 నుంచి 14వరకు జరుగబోయే శారదా పీఠం వార్షికోత్సవాలకు సిఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి సిఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 14న విశాఖకు వచ్చేందుకు అంగీకరించారు. ఆ రోజున శారదాపీఠంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నాక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆ తరువాత సిఎం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తారా లేక జగన్మోహన్ రెడ్డిని కలిసి వస్తారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్‌కు మద్య శారదాపీఠాధిపతి స్వరూపానందస్వామి మద్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.