
ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల నుంచి గట్టి పోటీ ఉండే సూచనలు స్పష్టంగా కనబడుతుండటంతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన పార్టీని గెలిపించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో అమిత్ షా తరచూ పర్యటిస్తూ పార్టీ నేతలను, కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తుంటే, మరోపక్క ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఆకట్టుకొనేందుకు అనేక సంక్షేమ పధకాలను ప్రకటించడానికి సిద్దం అవుతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి బలం పుంజుకొన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటక తప్ప మరెక్కడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేని స్థితిలో ఉంది. తెలంగాణ ఏర్పడక మునుపు రాష్ట్రంలో బిజెపి చాలా బలంగా ఉన్నప్పటికీ, గ్రేటర్ ఎన్నికల నుంచి రాష్ట్రంలో బిజెపి క్రమంగా బలహీనపడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 118 స్థానాలలో ఘోరపరాజయంతో డీలాపడింది. పంచాయతీ ఎన్నికలలో కూడా బిజెపి చాలా వెనుకబడిపోయింది. ఈ పరిస్థితులలో వస్తున్న లోక్‌సభ ఎన్నికలు బిజెపికి మరో అగ్నిపరీక్షగా మారబోతున్నాయి.
ఇతర పార్టీల మీద ఆధారపడకుండా కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావాలంటే కనీస మెజార్టీకి సరిపడినన్ని సీట్లు అయినా సాధించుకోవడం బిజెపికి చాలా అవసరం. కనుక అన్ని రాష్ట్రాలలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు బలమైన అభ్యర్ధులను సిద్దం చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే అమిత్ షా ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో సహా విజయం సాధించిన ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింఘ్, ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి నేతలు కిషన్ రెడ్డి, ఎన్.రాంచందర్‌రావు, సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ధర్మపురి అరవింద్, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ తదితరులను ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. వారుకాక డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, వీహెచ్‌పీ నేత భగవంత్‌రావు తదితరులు కూడా ఈసారి లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.
కనుక అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో అభ్యర్ధులను, వారి విజయావకాశాల గురించి లోతుగా చర్చించిన తరువాత తిరిగి డిల్లీ చేరుకోగానే ప్రధాని నరేంద్రమోడీతో మరోసారి చర్చించి అభ్యర్ధుల పేర్లు ఖరారు చేస్తారని సమాచారం.