తెలంగాణలో అకాల వర్షాలు

గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. వర్షం కారణంగా రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు తగ్గిపోవడంతో చలి పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తక్కువ నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో కూడా పలుప్రాంతాలలో వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయం అయ్యి  ద్విచక్రవాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పత్తి, వరి, మిరప, మొక్కజొన్న పంటలు తడిసిముద్దయ్యాయి. వేలాదిఎకరాలలో పంట నీట మునిగాయి.    జోగులాంబ గద్వాల జిల్లాలోని పలుప్రాంతాలలో ఆరబెట్టిన మిర్చి తడిసిపోవడంతో రైతులు విలపిస్తున్నారు.


రాష్ట్రంలో వివిద ప్రాంతాలలో కురిసిన వర్షపాతం వివరాలు: 

సిద్ధిపేట జిల్లాలో నంగునూరు-10 సెంటీమీటర్లు, దుబ్బాక-9, భూపాల్‌పల్లి, మొగుళ్లపల్లి, నర్మెట్ట-8, హుజురాబాద్‌-7, మంథని-6, తిమ్మాపూర్‌, బెజ్జంకి, జనగామ, పరకాల, వెంకటాపూర్‌, గంగాధర, ముస్తాబాద్‌, హుస్నాబాద్‌లలో-5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ నగరంలో రాజేంద్రనగర్‌లో 6.3, ఛార్మినార్‌ వద్ద 3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.