
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ, అనేకమంది ఎమ్మెల్యేలు తెరాసలో ఫిరాయించినప్పటికీ, కాంగ్రెస్ నేతలు చాలా ఆత్మవిశ్వాసంతోనే ఉండేవారు. 2019 ఎన్నికలలో తెరాసకు ముచ్చెమటలు పట్టించగలిగారు. కానీ ఈసారి ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయం పొందడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు నేటికీ అయోమయ స్థితిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలే సాధించింది. అయినా పార్టీ భవిష్యత్ పట్ల అందరిలో ఆందోళన నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు రెండు నెలలు కావస్తున్న సిఎం కేసీఆర్ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటుచేయకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మంత్రిపదవులు ఆశిస్తున్నవారు ఎంతమంది తెరాసలోకి వెళ్లిపోతారో తెలియని స్థితి కనిపిస్తోంది. మంత్రిపదవులు రాకపోయిన వేరే పదవుల కోసమైన ఫిరాయింపులు అనివార్యంగానే కనబడుతోంది. ఇటువంటి పరిస్థితులలో భువనగిరి తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులలో ఆందోళనను ఇంకా పెంచేవిగా ఉన్నాయి.
ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందో లేదో చెప్పలేను కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంతకాలంలో కాంగ్రెస్ పార్టీ అదృశ్యమైపోవడం ఖాయం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో ఈవీఎంల గురించి మాట్లాడటం లేదు కానీ ఓడిపోయిన చోట ఈవీఎంలలో లోపాలున్నాయని కోర్టులకెక్కుతున్నారు,” అని అన్నారు.