
కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశేషకృషి చేసిన 112 మంది ప్రముఖులు, (అ)సామాన్యులకు భారత ప్రభుత్వం 2019 సంవత్సరానికిగాను పద్మ అవార్డులు ప్రకటించింది. వారిలో ప్రముఖ సినీగేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు సునిల్ ఛెత్రి, రైతు నేస్తం సంస్థ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఒడిశాలో స్థిరపడి సమాజాసేవలు చేస్తున్న తెలుగువ్యక్తి దేవరపల్లి ప్రకాశరావు, దివంగత జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్, ఛత్తీస్ ఘఢ్కు చెందిన ప్రముఖ జానపదగాయని తీజన్బాయ్ తదితరులకు పద్మ అవార్డులు ప్రకటించింది.
ఈసారి నలుగురికి పద్మవిభూషన్, 14 మందికి పద్మభూషన్, 94 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. వారిలో 11మంది విదేశీయులు, విదేశాలలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందినవారు కూడా ఉన్నారు. పద్మ అవార్డులు పొందినవారిలో 21 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ (నపుంసక) ఉన్నారు.
కర్ణాటకకు చెందిన 106 ఏళ్ళు వయసుగల అతిసామాన్య మహిళా సాలుమరద తిమ్మక్కకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఆమె గత ఆరు దశాబ్ధాలుగా కర్నాటకలో లక్షలాది మొక్కలు నాటి వాటి సంరక్షణ చేసి పచ్చదనం రాష్ట్రంలో పెరిగేందుకు కృషి చేస్తున్నారు. కర్ణాటకలోనే కాక ఆమె దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మొక్కల పెంపకం గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
ఒడిశాకు చెందిన దయితారి నాయక్ వయసు 75 ఏళ్ళు. తమ బైతరణీ గ్రామానికి సాగునీరు లేకపోవడం చూసి భగీరధప్రయత్నం చేసి నీటిని తీసుకువచ్చిన ఘనుడు. ఊరుకు సమీపంలో గల కొండపై నుంచి పారుతున్న నీటిని కాలువలు త్రవ్వి మళ్లించుకున్నట్లయితే చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సాగు, త్రాగు నీరు వస్తుందని గ్రామస్తులకు నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో అతనొక్కడే కేవలం పలుగుపారలతో 3 కిమీ కాలువ త్రవ్వి కొండలపై పారుతున్న నీటిని ఊరుకు తీసుకువచ్చాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాలలో నీటి కరువు తీరిపోయింది.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ సెరింగ్ నోర్బూ (74) మారుమూల ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడి పేదప్రజలకు గత 50 ఏళ్లుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఏటా సుమారు 500 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తుంటారు.
జర్మనీ దేశస్థురాలైన ఫ్రెడిరైక్ ఇరినా బ్రునింగ్ (59) మధురలో స్థిరపడి అక్కడ గత 23 ఏళ్లుగా సురభి గోసేవా నికేతన్ అనే గోసంరక్షణాలయాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికులు ఆమెను సుదేవీ మాతాజీ అని గౌరవంగా చెప్పుకొంటారు. ఆమె మధుర, పరిసర ప్రాంతాలలో రోడ్లపై తిరిగే ముసలి ఆవులను, అనారోగ్యానికి, నిరాధారణకు గురైనవాటిని తన గోశాలకు తీసుకువచ్చి సంరక్షిస్తుంటారు. వాటికోసం ఆమె నెలకు సుమారు రూ.22 లక్షలు వరకు ఖర్చు చేస్తుంటారు. గత రెండు దశాబ్ధాలలో ఆమె వేలాది ఆవులను కాపాడారు. ప్రస్తుతం సురభి గోసేవా నికేతన్ లో 1200 ఆవులను సంరక్షిస్తున్నారు.
ఈవిధంగా వివిదరంగాలలో కృషి చేస్తున్న ప్రముఖులకు, లోకానికిని తెలియని అసామాన్యులను భారత ప్రభుత్వం గుర్తించి వారిని పద్మశ్రీ అవార్డులతో గౌరవించడం అభినందనీయం.