
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలకు శుక్రవారం కేంద్రప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించింది.
ప్రణబ్ ముఖర్జీ 2012-17 మద్యకాలంలో భారత 13వ రాష్ట్రపతిగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ, “నాకు లభించిన ఈ గొప్ప గౌరవాన్ని దేశప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతాభావంతో, విధేయతతో స్వీకరిస్తున్నాను. గతంలో నేను చెప్పినదే మళ్ళీ ఇప్పుడు చెపుతున్నాను. దేశప్రజలకు నేను చేసినదానికంటే వారే నాకు చాలా ఎక్కువ తిరిగి ఇచ్చారు. అందుకు సర్వదావారికి కృతజ్ఞతలు తెలుపుకొంటాను,”అని ట్వీట్ చేశారు.
అస్సాంకు చెందిన వాగ్గేయకారుడు స్వర్గీయ భూపేన్ హజారికా పరిచయం అక్కరలేని గొప్ప వ్యక్తి. ఆయన వ్రాసిన, పాడిన పాటలు, దేశభక్తిగీతాలకు అత్యంత ప్రజాధారణ లభించడంతో అవి హిందీ, బెంగాలీ తదితర బాషలలోకి తర్జూమా చేయబడ్డాయి. ఆయన పాటలలో దేశభక్తి, ఎల్లలు లేని మానవత్వం, సోదరభావం, సమన్యాయం వంటివి అంతర్లీనంగా ఉండటంతో పొరుగునే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు కూడా వాటిని పాడుకునేవారు. ఆయన సాహిత్యాన్ని తమ బాషలోకి అనువదించుకునేవారు. భూపేన్ హజారికా హిందీ సినీ పరిశ్రమలో ప్రవేశించిన తరువాత ఆయన నేపద్యగాయకుడిగా, సినీ కధా రచయితగా, సినీ దర్శకుడిగా గొప్ప పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయనకు అనేక సినీ, జాతీయ అవార్డులు లభించాయి. మరణాంతం ఈ అత్యున్నత పురస్కారం లభించింది.
మహారాష్ట్రకు చెందిన స్వర్గీయ నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన జనసంఘ్ నాయకుడిగా కంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో చేసిన అనేకానేక సేవాకార్యక్రమాల వలననే గొప్ప సమాజాసేవకుడిగా పేరు సంపాదించుకున్నారు. బాల్యం నుంచి చదువులపై చాలా ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించుకొంటూ (బిట్స్ పిలానీలో) ఉన్నత చదువులు చదివారు. చదువు విలువ తెలిసిన వ్యక్తి కావడంతో దేశంలో నిరుపేద పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా సరస్వతీ నిలయాలు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామీణప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చాలా కృషి చేశారు. ముఖ్యంగా గ్రామాలలో కులవివక్ష, అసమానతలు తొలగించేందుకు విశేషకృషి చేశారు. ఆయన 1977లో బిజెపి తరపున లోక్‌సభ సభ్యుడిగా, 1999లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపీగా సేవలందించారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ యూనివర్సిటీ మధ్యప్రదేశ్ లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’ స్థాపనకు ఆయనే కారకుడు. ఆయన 2010 లో కన్నుమూశారు.
మోడీ ప్రభుత్వం ఇటువంటి ముగ్గురు గొప్ప వ్యక్తులను భారతరత్న అవార్డు ప్రకటించడంతో ప్రజలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.