ఎన్నికల అవకతవకలపై మరో పిటిషన్‌!

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికల అవకతవకలపై వరుసగా హైకోర్టులో పిటిషన్‌లు దాఖలవుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ఓట్ల లెక్కింపులో 15 రౌండ్లవరకు అంతా సవ్యంగా సాగినప్పటికీ చివరి రెండు రౌండ్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అప్పుడే తాను అభ్యంతరం చెప్పానని కానీ కౌంటింగ్ అధికారులు పట్టించుకోకుండా తెరాస అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ 441 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారని లక్ష్మణ్‌ కుమార్‌ తన పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబందనల ప్రకారం కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించడానికి వీలులేదు కానీ ఆరోజున కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీసులు వారితోపాటు తెరాస కార్యకర్తలు కూడా లోపలకు ప్రవేశించి కౌంటింగ్ అధికారులను ప్రభావితం చేశారని లక్ష్మణ్‌ కుమార్‌ ఆరోపించారు. తన ఆరోపణలకు నిదర్శనంగా కౌంటింగు కేంద్రంలో రికార్డయిన వీడియో క్లిప్పింగులను కూడా హైకోర్టుకు సమర్పించారు. సమాచార హక్కు చట్టం క్రింద వాటిని ఆయన ఎన్నికల సంఘం నుంచి తీసుకున్నారు. 

ధర్మపురి నియోజకవర్గం నుంచి మొత్తం 11 మంది అభ్యర్ధులు పోటీపడగా వారిలో తెరాస అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్‌ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మద్యనే పోటీ ప్రధానంగా సాగింది. అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు 70,138 ఓట్లు పోలవగా, తెరాస అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్‌కు 70,579 ఓట్లు వచ్చినందున 441 ఓట్లు తేడాతో గెలిచినట్లు కౌంటింగ్ అధికారి ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు ఏమైనా అభ్యంతరాలున్నట్లయితే హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. లక్ష్మణ్‌ కుమార్‌ వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.