
రాష్ట్రంలో రెండవిడత పంచాయతీ ఎన్నికలకు ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి 2గంటల నుంచి ఓట్లు లెక్కింపు మొదలుపెడతారు. లెక్కింపు పూర్తవగానే వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. రెండవ విడత ఎన్నికలలో మొత్తం 4,137 పంచాయతీలలో 788 గ్రామాలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మిగిలిన 3,342 పంచాయతీలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికోసం మొత్తం 29,964 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.
మొదటివిడత పంచాయతీ ఎన్నికలలో 4,470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా వాటిలో ఏకగ్రీవాలతో కలిపి తెరాస 2,629 స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్-920, బిజెపి-67, టిడిపి-31, సిపిఎం-32, సిపిఐ-19, ఇతరులు 758 స్థానాలలో విజయం సాధించారు. కనుక రెండవ విడత ఎన్నికలలో కూడా అదేవిధంగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండవ విడతలో 3342 సర్పంచ్ పదవులకు ఏకంగా 10,317 మంది పోటీ పడుతుడటం గమనిస్తే ఈ ఎన్నికల ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. ఈ పంచాయతీలలో గల 36,620 వార్డులలో 10,317 ఏకగ్రీవాలు కాగా మిగిలిన 26,209 వార్డులకు ఏకంగా 63,380 మంది పోటీ పడుతుండటం విశేషం.