సూర్యాపేటలో బ్యాలెట్ పేపర్లు బయటపడేసి విజేత ప్రకటన!

సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలోని గుంజలూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వై. బుచ్చిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 21న గుంజలూరు గ్రామంలో జరిగిన ఎన్నికలలో బుచ్చిరెడ్డి స్టేజ్-2 రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించచారు. మొత్తం 1252 ఓట్లు పోలవగా, కౌంటింగ్ చేసినప్పుడు 1013 బ్యాలెట్ పేపర్లు మాత్రమే లెక్క తేలాయి. మిగిలిన 239 బ్యాలెట్ పేపర్ల సంగతి తేల్చకుండానే తెరాస బలపరిచిన అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించేసి, ఎన్నికల సామాగ్రిని ఉన్నతాధికారులకు అప్పగించేశారు. 

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్ధి దారోజు శారద ఎంపీడీఓ శైలజకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల సహాయంతో ఆమె పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన పాఠశాల పరిసరాలను గాలించగా, పాఠశాల గోడ వెనుకున్న చెత్తకుప్పలో మిగిలిన 239 బ్యాలెట్ పేపర్లు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని సంబందిత ఎన్నికల అధికారులకు అప్పగించి, బుచ్చిరెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా దారోజు శారద మీడియాతో మాట్లాడుతూ, “తెరాస అభ్యర్ధి ప్రలోభాలకు రిటర్నింగ్ అధికారి లొంగి కౌంటింగులో మోసం చేద్దామనుకున్నాడు. కానీ మేము అప్రమత్తంగా ఉన్నామని గుర్తించి మాకు పడిన ఓట్లను పక్కకు తప్పించి హడావుడిగా కౌంటింగ్ పూర్తిచేసి తెరాస అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించేశాడు. కానీ పోలైన ఓట్లకు, బ్యాలెట్ పేపర్లకు లెక్కలు తేడా వచ్చినట్లు మేము గుర్తించి నిలదీయడంతో దొరికిపోయాడు. తెరాస అభ్యర్ధిని గెలిపించేందుకే ఈ నాటకం ఆడాడు,” అని అన్నారు.