ధర్నా చౌక్ వద్ద మళ్ళీ ధర్నాలు చేసుకోవచ్చా?

కాంగ్రెస్‌, టిజేఎస్‌, సిపిఐ పార్టీల నేతలు గురువారం ధర్నాచౌక్ వద్ద ధర్నా చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరమణ ఆ మూడు పార్టీల సీనియర్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ నేత డికె అరుణ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తోంది. ఆ ధైర్యంతోనే ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు. అంతేకాదు...ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో, ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయో, ఏ నియోజకవర్గంలో ఎవరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారో ముందే చెప్పారు. దానిని బట్టి కేసీఆర్‌ ఆదేశానుసారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు నడుచుకొంటున్నారని స్పష్టం అయ్యింది. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని మేము ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించిన రజత్ కుమార్, ఎన్నికల తరువాత ‘సారీ’ చెప్పేసి చేతులు దులుపుకున్నారు. పోలింగులో ఓటర్ల సంఖ్యకు, వివి ఫ్యాట్లలో రశీదులకు పొంతనలేదు. అదేవిధంగా కౌంటింగులో కూడా చాలా అవకతవకలు జరిగాయి. మేము వీటి గురించి ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్‌కు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఆయన తెరాసకు అంతగా సంహకరించినందుకే సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ తదితరులు ఆయనకు తెలుపుకున్నారు. కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తెరాసకు అన్నివిధాల సహకరించింది కనుకనే సిఎం కేసీఆర్‌ డిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర ఎన్నికల కమీషనరును కలిసి ధన్యవాదాలు తెలుపుకున్నారు. తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రజత్ కుమార్‌ను లోక్‌సభ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని కోరుతున్నాము,” అని అన్నారు. 

టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో ఒకపక్క తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే, మరోపక్క రజత్ కుమార్‌ తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కనుక ఎన్నికలలో జరిగిన అవకతవకలపై, ముఖ్యంగా రజత్ కుమార్‌పై విచారణ జరిపించాలి,” అని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కనుక ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు జరుగకుండా నివారించేందుకు వారేమైనా చేయగలరేమో ఆలోచించుకుంటే మంచిది. 

ధర్నా చౌక్ వద్ద వారు ధర్నా చేయడానికి పోలీసులు అనుమతించినందున ప్రభుత్వ వైఖరి మారినట్లే కనిపిస్తోంది. కనుక ఇకపై ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు.