
కాంగ్రెస్, టిడిపి అధినేతలు రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు ఇద్దరూ ఎంత సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులు వికటించినందున, త్వరలో జరుగబోయే లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికలలో వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబునాయుడు ఇప్పటికే ఈవిషయం ప్రకటించగా, ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఉమెన్ చాంధీ కూడా దీనిని నేడు దృవీకరించారు. అయితే జాతీయస్థాయిలో కలిసిపనిచేయాలని నిర్ణయించుకున్నామని రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు తెలిపారు. కనుక త్వరలో అమరావతిలో టిడిపి నిర్వహించబోయే ధర్మపోరాట బహిరంగసభకు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్, మిత్రపక్షాల నేతలందరినీ చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తున్నారు.
కాంగ్రెస్-టిడిపిలు పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఆమోదించరని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తేలిపోయింది. దాని వలన టిడిపి కొత్తగా నష్టపోయిందేమీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భారీ మూల్యం చెల్లించింది. అదే ఏపీలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నట్లయితే, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత కారణంగా టిడిపి కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది కనుకనే చంద్రబాబునాయుడు జాగ్రత్తపడ్డారని చెప్పవచ్చు. అయితే ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకపోయినా, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని చంద్రబాబునాయుడు బహిరంగంగానే చెపుతున్నారు కనుక ఏపీ ప్రజలు టిడిపిని మళ్ళీ గెలిపిస్తారో లేక తిరస్కరిస్తారో ఇప్పుడే ఊహించడం కష్టం. ఎన్నికలలో పోటీ ప్రధానంగా టిడిపి-వైకాపాల మద్యనే ఉంటుంది కనుక టిడిపితో పొత్తులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏపీలో కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి రావడం అసంభవమేనని చెప్పవచ్చు.