రాష్ట్రంలో పెన్షన్ పొందబోయేవారి సంఖ్య: 50 లక్షలు

దేశంలో అత్యధికమందికి అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పటివరకు ప్రతీనెల 39,52,410 మందికి పెన్షన్లు ఇస్తోంది. వారి సంఖ్య ఇప్పుడు 50 లక్షలకు పెరిగింది. ఇప్పటి వరకు 60 ఏళ్ళున్న వారికి మాత్రమే పెన్షన్ లభించేది కానీ ఇప్పుడు 57 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ ఇవ్వబోతున్నందున పెన్షన్ లబ్దిదారుల సంఖ్య ఒకేసారి 10.5 లక్షలు పెరిగింది.  

అలాగే ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు నెలకు రూ.1,000, వికలాంగులు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.1500 లభిస్తుండేది. తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తే వాటిని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చినందున ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారందరూ నెలకు రూ.2,016, రూ.3,016 అందుకోబోతున్నారు. 

వీటికోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5,043.92 కోట్లు కేటాయిస్తోంది. పెన్షన్ లబ్దిదారుల సంఖ్య, పెన్షన్ మొత్తాలు కూడా గణనీయంగా పెరిగినందున ఇక నుంచి ఏడాదికి రూ.12,696 కోట్లు కేటాయించవలసి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై అధనంగా ఏడాదికి రూ. 7652.08 కోట్లు అధనపు భారం పడుతుందన్నమాట. ఇవికాక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్‌ కిట్స్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, బతుకమ్మ చీరలు, కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ వంటి పలుసంక్షేమపధకాలు ఉండనే ఉన్నాయి. వాటన్నిటికీ వేలకోట్లు ఖర్చు చేస్తూనే ఉంది. ఈవిధంగా ఇన్ని సంక్షేమ పధకాలపై ఇంత భారీగా నిధులు ఖర్చుచేసే ప్రభుత్వం దేశంలో మరొకటి లేదనే చెప్పవచ్చు.