కిషన్ రెడ్డిపై హత్యారోపణలు!

లండన్ పారిపోయిన సయ్యద్ సుజా అనే హ్యాకింగ్ నిపుణుడు తెలంగాణ బిజెపి సీనియర్ నేత కిషన్ రెడ్డిపై హత్యారోపణలు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన లండన్లో జరిగిన మీడియా సమావేశంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ "ఈవీఎంలను ట్యాంపరింగ్, హ్యాకింగ్ చేయవచ్చునని తమ బృందం నిరూపించిందని, 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి ఈవీఎంలను హ్యాక్ చేసి విజయం సాధించిందని ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌, బిజెపిల మద్య అప్పుడే మాటల యుద్దం మొదలైంది కూడా. 

సయ్యద్ సుజా ఏమి చెప్పరంటే, తాను గతంలో ఈవీఎంలను పరీక్షించే బృందంలో సభ్యుడిగా ఉండేవాడినని, ఈవీఎంలను తయారుచేస్తున్న ఈసీఐఎల్ అభ్యర్ధన మేరకు విన్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థలోని తమ బృందం ఈవీఎంలను పరీక్షించినప్పుడు ఈవిషయం కనుగొన్నామని తెలిపారు. అనంతరం తమ బృందంలో కొందరు అనుమానాస్పద పరిస్థితులలో మరణించారని తాను ప్రాణభయంతో అమెరికా పారిపోయి వచ్చేశానని సయ్యద్ సుజా తెలిపారు. 

2014, మే 13న తెల్లవారుజామున తాను 13 మందితో కలిసి ఈవీఎంలను హ్యాక్ చేయడం గురించి చర్చించడానికి ‌ఉప్పల్ లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజి వద్దగల కాకిరెడ్డి (బిజెపి నేత కిషన్ రెడ్డి బావమరిది) గెస్ట్‌హౌస్‌కు వెళ్ళామని, ఆ సమయంలో అక్కడే ఉన్న కిషన్ రెడ్డి మా అందరినీ కాల్చి చంపేయమని తన గన్‌మెన్లను ఆదేశించడంతో వారు జరిపిన కాల్పులలో తమవాళ్లు 11 మంది అక్కడే చనిపోయారని సయ్యద్ సుజా తెలిపారు. తాను మాత్రం తప్పించుకొని అమెరికా పారిపోయానని సయ్యద్ సుజా తెలిపారు. ఆ రోజు గెస్ట్‌హౌస్‌లో సమావేశం ఏర్పాటుచేసిన కమల్‌రావు కూడా ఆ కాల్పులలో చనిపోయారని సయ్యద్ సుజా తెలిపారు. అయితే ఆ కాల్పుల ఘటనను మతకలహాలుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి తప్పించుకున్నారని సయ్యద్ సుజా ఆరోపించారు. విన్‌ సొల్యూషన్స్‌ రికార్డులను, హతుల గురించి దర్యాప్తు చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ వెనుక జరిగిన కుట్రలు, హత్యలు అన్ని బయటపడతాయని సయ్యద్ సుజీ ఆరోపించారు. లండన్లో మీడియా సమావేశం నిర్వహించినప్పుడు కూడా సయ్యద్ సుజూ తనను ఎవరూ గుర్తించకుండా మొహానికి ముసుగు ధరించి హాజరయ్యారు. నేటికీ తన ప్రాణహాని ఉందని కనుకనే తాను రహస్యంగా విదేశాలలో బ్రతకవలసివస్తోందని సయ్యద్ సుజీ తెలిపారు.

అయితే కేంద్రప్రభుత్వం, ఈసీఐఎల్, కిషన్ రెడ్డి ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.