
ఆగ్రవర్ణాలలో ఆర్ధికంగా వెనుకబడినవారికి విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడులోని ప్రతిపక్ష డిఎంకె పార్టీ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషను దాఖలు చేసింది. రిజర్వేషన్ల వ్యవస్థ దేశంలో కులవివక్షను తగ్గించి బడుగుబలహీనవర్గాలకు సమాజంలో మిగిలినవారితో సమానంగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిందే తప్ప పేదరిక నిర్మూలన, విద్యా, ఉద్యోగాల కోసం చేసింది కాదని పిటిషనులో పేర్కొంది. కనుక ఆ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డిఎంకె పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషను వేసింది. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఫిభ్రవరి 18వ తేదీలోగా కౌంటరు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషను వేశారు. దానిపై బుదవారం విచారణ జరిగే అవకాశం ఉంది కనుక తెలంగాణ హైకోర్టు కూడా కేంద్రాన్ని వివరణ కోరుతూ నోటీసు పంపించడం ఖాయమే.
ఈరోజుల్లో ప్రతీ అంశంపై రాజకీయ ఉద్దేశ్యాలతో కోర్టులో పిటిషన్లు వేయడం సర్వసాధారణమైపోయింది కనుక రానున్న రోజులలో ఈబీసీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇంకా అనేక పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఈవిధంగా ఒక్కో రాష్ట్రంలో హైకోర్టుకు సంజాయిషీలు ఇచ్చుకొంటూ వెళ్ళడం కష్టం కనుక అన్నిటికీ కలిపి ఒకేసారి సుప్రీంకోర్టులో తేల్చుకొంటుందేమో?