కుమారస్వామి ప్రభుత్వానిది మూన్నాళ్ల ముచ్చటేనా?

కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కోల్‌కతాలో మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీలో పాల్గొంటే, కర్నాటకలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు తెరవెనుక ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బిజెపి నేతలు తెర వెనుక చేస్తున్న మంతనాల ప్రభావమో లేక అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ ఆశపడుతోందో తెలియదు కానీ సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుమారస్వామిని మార్చాలంటూ పట్టుబడుతున్నారు. వారిలో కొంతమంది ఇటీవల రహస్యంగా ముంబై వెళ్ళి అక్కడ బిజెపి నేతలతో చర్చలు సాగిస్తున్నారని తెలియడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు ఆదివారం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించగా నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దానికి డుమ్మా కొట్టారు. అంటే ఆ నలుగురు బిజెపివైపు వెళ్లిపోయే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. పార్టీ పరిస్థితిని పరిశీలించుకోవడానికి మళ్ళీ ఇవాళ్ళ మరోసారి  శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈసారి ఎంతమంది డుమ్మా కొడతారో చూడాలి. 

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుండగా వాటిలో బిజెపి-104, కాంగ్రెస్-78, జెడిఎస్-36, బిఎస్పీ-1, ఇతరులు-2 స్థానాలలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 111 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా బిజెపికి 104 మాత్రమే లభించడంతో కాంగ్రెస్‌, జెడిఎస్ కలిసి (114) ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కనుక నలుగురు ఎమ్మెల్యేలను బిజెపి ఆకర్షించగలిగితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోతుంది. ప్రస్తుతం ఆ ప్రయత్నాలే జోరుగా సాగుతున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.