సన్యాసి అయితేనేమి...మనిషే కదా?

ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రజలను ఆకట్టుకోవడానికి ఏవో ఒక తాయిలాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పెన్షన్లు రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యోగీ సర్కారు తెలుగు రాష్ట్రాలతో పోటీ పడలేకపోయినా, చాలా కాలంగా నామమాత్రపు పెన్షన్లు ఇస్తూనే ఉంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు నెలకు రూ.400, 80 ఏళ్ళు దాటినవారికి నెలకు రూ.800 అందిస్తోంది. తాజాగా సాధువులు సన్యాసులకు కూడా ఆ వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ స్వయంగా ఓ పెద్ద సాధువు కనుక రాష్ట్రంలో సాధు సన్యాసుల కష్టాలు ఆయనకు బాగానే తెలుసుంటాయి కదా అందుకే వారికీ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లున్నారు. యోగీ సర్కారు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, వారు సాధువులు, సన్యాసులు అయితేనేమీ వారు కూడా మనుషులే కదా? వారికి పెన్షన్లు ఇస్తే తప్పేమిటి? అని ప్రశ్నిస్తోంది. నిజమే కదా!