.jpg)
తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో టిడిపిని ఓడించేందుకు తెరాస సిద్దం చేస్తున్న వ్యూహాన్ని ఈరోజు బయటపెట్టారు. “చంద్రబాబునాయుడు బీసీలకు జనాభా ప్రాతిపాదికన సముచిత ప్రాధాన్యత కల్పించడంలో విఫలమయ్యారు. కనుక ఏపీలో బీసీలందరికీ నేనే నాయకత్వం వహించి వారినందరినీ ఏకం చేస్తాను. తద్వారా ఏపీలో కనీసం ఒక్క శాతం ఓట్లను ప్రభావితం చేయగలమని భావిస్తున్నాను. అలాగే ఏపీలో యాదవుల జనాభా కూడా భారీగానే ఉంది కనుక వారందరినీ కూడా ఏకత్రాటిపైకి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఏపీలో భారీ మెజార్టీలతో పార్టీలు...అభ్యర్ధులు గెలిచే పరిస్థితులులేవు. కేవలం కొన్నివందల ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమవుతాయని భావిస్తున్నాను. నేను విజయవాడ, భీమవరంలో పర్యటిస్తేనే చంద్రబాబునాయుడు గజగజవణికిపోయారు ఇక కేసీఆర్ పర్యటిస్తే ఏమవుతారో?” అని ఎద్దేవా తలసాని చేశారు.
అయితే విజయవాడలో యాదవ సంఘాలతో కలిసి తలసాని దుర్గమ్మ గుడివరకు బలప్రదర్శన చేసినప్పుడే చంద్రబాబునాయుడు ఆయన ఉద్దేశ్యాన్ని, తెరాస వ్యూహాన్ని పసిగట్టారు. అందుకే తెరాస, వైసీపీ, బిజెపిలు మూడు కలిసి రాష్ట్రంలోని బీసీలలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాయని కనుక వాటి కుట్రలు, కుతంత్రాలను గుర్తించి త్రిప్పికొట్టాలని చంద్రబాబునాయుడు టిడిపి నేతలను హెచ్చరించారు. ఈవిషయంలో తక్షణమే బీసీలను చైతన్యం చేయాలని ఆదేశించారు.
అంటే బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడం ద్వారా చంద్రబాబునాయుడును దెబ్బ తీయాలని తెరాస, బీసీలు చేజారిపోకుండా కాపాడుకోవాలని చంద్రబాబునాయుడు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్పష్టం అవుతోంది. కనుక బీసీ ఓటర్లను ఆకట్టుకోవడంలో తెరాస, టిడిపిలలో ఎవరు సఫలం అవుతారో చూడాలి.