మమతక్క బలప్రదర్శన నేడే

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో ఈరోజు కోల్‌కతాలో‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీ ప్రధానంగా బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలనన్నిటినీ ఏకత్రాటిపైకి తీసుకువచ్చి, వాటి ఐక్యతను చాటి చెప్పడం, లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఎదుర్కొని ఓడించగలమని దేశప్రజలలో నమ్మకం కలిగించడం కోసం నిర్వహించబడుతోంది. పనిలోపనిగా ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న మమతా బెనర్జీ తన శక్తి సామర్ధ్యాలను, పలుకుబడిని దేశప్రజలకు, మిత్రపక్షాలకు చాటి చెప్పాలనుకొంటున్నారు. 

కనుక దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలు అందరూ ఈర్యాలీకి హాజరయ్యారు. కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జునఖర్గే, అభిషేక్ సింఘ్ని, చంద్రబాబునాయుడు (టిడిపి), శరద్ పవార్ (ఐ.ఎన్.సి)అఖిలేష్ యాదవ్ (ఎస్పీ), సతీష్ మిశ్రా (బిఎస్పీ),  శరద్ యాదవ్ (ఎల్.జె.డి), స్టాలిన్ (డిఎంకె), దేవేగౌడ, కుమారస్వామి (జెడిఎస్), అరవింద్ కేజ్రీవాల్(ఆమాద్మీ), ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), హేమంత్ సొరేన్ (జెఎంఎం), అజిత్ సింగ్ (ఆర్.ఎల్.డి), తేజస్వీయాదవ్ (ఆర్.జె.డి), శతృఘ్నసిన్హా (బిజెపి), యశ్వంత్‌సిన్హా, హార్దిక్‌పటేల్, జిఘ్నేశ్, అరుణ్‌శౌరి ఇంకా అనేకమంది హేమాహేమీలు ఈర్యాలీలో పాల్గొనడానికి కోల్‌కతా చేరుకున్నారు.

కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానంలో ఈరోజు సాయంత్రం జరుగబోయే బహిరంగసభకు ఇప్పటికే లక్షలాదిమంది ప్రజలు చేరుకోవడంతో కోల్‌కతా నగరమంతటా పండగ వాతావారణం నెలకొంది. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న  ప్రముఖ రాజకీయనేతలతో మమతా బెనర్జీ వేరువేరుగా సమావేశమవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఒకే వేదికపై నుంచి వారు ప్రసంగించనున్నారు.