నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఉదయం 11 గంటలకు సిఎం కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులు అర్పించిన తరువాత శాసనసభకు చేరుకొంటారు. ప్రోటెం స్పీకర్‌గా నియమితులైన ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శాసనసభ సమావేశం అవుతుంది. ఆయన ముందుగా కేసీఆర్‌ చేత ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తరువాత అక్షర క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరి చేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. మొట్టమొదట తెరాస ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. చివరిగా వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు. సుమారు రెండు గంటల పాటు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. 

అనంతరం శాసనసభ సభ్యులు, మండలి సభ్యులందరికీ సిఎం కేసీఆర్‌ జూబ్లీ హాలు ప్రాంగణంలో విందుభోజనం ఇస్తారు. ఈరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాసనసభ స్పీకరు పదవికి నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు ఉదయం స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. (శాసనసభ స్పీకర్‌గా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తాజా సమాచారం.) రేపే మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఆ తరువాత శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు జరుగుథాయి. జనవరి 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. జనవరి 20న ఆయన ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదం తెలుపడంతో శాసనసభ, మండలి సమావేశాలు ముగుస్తాయి.